AP Govt Official Press Note పి.ఆర్.సి. అమలు వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో తగ్గుదల ఉండదు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ
AP Govt Official Press Note
అమరావతి, జనవరి : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 11 వ పి.ఆర్.సి. అమల్లో భాగంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జారీచేసిన వుత్తర్వుల వల్ల ఉద్యోగుల స్థూల జీతాల్లో ఏమాత్రం తరుగుదల ఉండబోదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టంచేశారు.
పి.ఆర్.సి. అమలు నేపథ్యంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, ఆర్థిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ తదితర అధికారులతో కూడిన కమిటీతో కలసి ఆయన అమరావతి సచివాలయం ఐదో బ్లాకులో పాత్రికేయులతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సవీర్ శర్మ మాట్లాడుతూ కరోనా వల్ల రాష్ట్ర ఆదాయం ఎంతగానో తగ్గిందని, రూ.98 వేల కోట్లు రావాల్సిన రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్లకు పడిపోయిందని, మరో వైపు మూడో వేవ్లో వ్యాపిస్తున్న ఒ కూడా ప్రభుత్వం దీటుగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదన్నారు.
ఇటు వంటి పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు ఏమాత్రం లోటు చేయకుండా ప్రభుత్వం తనవంతు కృషిచేస్తున్నదని ఆయన తెలిపారు . రాష్ట్ర ఆదాయానికి అనుగుణంగా అన్ని వర్గాల వారిని సంతృప్తి పర్చే రాష్ట్ర బడ్జెను ను బ్యాలెన్సింగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.
PRC Presentation in Press Meet : Click Here
రాష్ట్రంలో ఉద్యోగులకు, అధికారులకు, ప్రజలకు లబ్ధి చేకూర్చడంతో పాటు సంక్షేమ పథకాలు, మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర బడ్జెట్ ను ఎంతో బ్యాలెన్సింగా వినియోగించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.
అందులో భాగంగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను, ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులకు సాధ్యమైనంత మేర లబ్దిచేకూర్చే విధంగానే పి.ఆర్.సి.ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన తెలిపారు.
Gross Salary Hike : AP Govt Official Press Note
ఒక్క హెచ్.ఆర్.ఏ. తరుగుదల శాతాన్నే ఉద్యోగులు పరిగణలోకి తీసుకోవడం సరికాదని, దానికి తోడు డి.ఏ., ఫిట్మెంట్ తదితర అంశాలను కూడా పరిణలోకి తీసుకుని లెక్కిస్తే ఉద్యోగుల స్థూల జీతాల్లో పెరుగుదల కనిపిస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2008-2009 పి.ఆర్.సి. అమలు సమయంలో తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశానని, గత పదేళ్లలో పి.ఆర్.సి.ల అమలు అంశంలో ఉన్న అనుభవంతోనే ఉద్యోగులకు సాధ్యమైనంత మేలు చేసే విధంగా అధికారులు కమిటీ ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు చేయడం జరిగిందన్నారు.
అదే సమయంలో ముగ్గరు సభ్యులతో కూడిన సెంట్రల్ పే కమిషన్ ఎంతో శాస్త్రీయంగా రూపొందించే సెంట్రల్ పి.ఆర్.సి.లోని కొన్ని అంశాలను పరిగణలోనికి తీసుకోవడం జరిగిందన్నారు. అందులో భాగంగానే పెన్షనర్లకు సంబందించిన కొన్ని అంశాలను ఈ పి.ఆర్.సి.లో అమలు చేయడం జరిగిందన్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సగటు మానవుని జీవిత కాలం ఎంతో పెరిగిన నేపథ్యంలో ఉద్యోగులు రిటైర్మెంట్ కాలాన్ని ప్రభుత్వం మరో రెండేళ్లు పొడిగించడం జరిగిందని ఆయన తెలిపారు.
ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల రాష్ట్రం ఎదుర్కొంటున్న లోటు బడ్జెట్ మరియు రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను, పి.ఆర్.సి. అమలు వల్ల ప్రభుత్వం పై పడే అదనపు భారాన్ని పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించారు.
PRC Presentation in Press Meet : Click Here
ఆర్ధిక మరియు సర్వీసెస్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 1974 నుండి రాష్ట్రంలో ప్రకటించిన ఫిట్మెంట్ వివరాలను, ప్రస్తుత ఫిట్మెంట్ వల్ల ప్రభుత్వం పై పడే ఆర్థిక భారాన్ని, ప్రస్తుత పి.ఆర్.సి. అమలోని ముఖ్యాంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) పి.చంద్రశేఖర్ రెడ్డి, ఆర్థికశాఖ ఇఓ కార్యదర్శి కెవివి సత్యనారాయణ, రాష్ట్ర సమచార పౌర సంబంధాల శాఖ ఎక్స్ అఫిషియో సెక్రటరీ టి. విజయ కుమార్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సి.ఎస్. పి. ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.
(ప్రచార విభాగం సమాచారశాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)
నోటు: పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా వివరించిన గణాంకాల నోటును పబ్లిసెల్ / ఎ.డి.,ఎస్.ఐ.సి. గ్రూపుల్లో పోస్టుచేసిన విషయాన్ని గమనించ మనవి.
[post_ads_2]