Vijayawada News: విజయవాడ వాసులతో ఇప్పట్లో కష్టాలు తప్పవా? అంటే తప్పేలా లేవు. రేపటి(డిసెంబర్ 10)న జరగాల్సిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది.
విజయవాడ వాసులతో ఇప్పట్లో కష్టాలు తప్పవా? అంటే తప్పేలా లేవు. రేపటి(డిసెంబర్ 10)న జరగాల్సిన బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం మరోసారి వాయిదా పడింది. దీంతో మరికొంత కాలం విజయవాడ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు. గతంలో పలుసార్లు ఈ ప్రారంభోత్సవం వాయిదాపడింది. ముందుగా నిర్ణయించిన మేరకు షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10న బెంజ్ సర్కిల్ రెండో ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ పాల్గొని ఫ్లై ఓవర్ ప్రారంభించాల్సి ఉంది. రెండో ఫ్లై ఓవర్ ప్రారంభానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఏర్పాట్లను రహదారుల శాఖ మంత్రి శంకరనారాయణ, అధికారులు పర్యవేక్షించారు. అయితే సిడిఎస్ చీఫ్ బిపిన్ రావత్ హఠ్మారణంతో మరోసారి వాయిదా పడింది.
వాస్తవానికి రూ.16,500 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన 1045 కిలోమీటర్ల 41 ప్రాజెక్టులు ప్రారంభించాల్సి ఉంది. బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ రూపుదిద్దుకోవడానికి దశాబ్దంన్నరపైనే పట్టింది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కావల్సిన ఫ్లైఓవర్ మూడోసారి వాయిదా పడింది. స్క్రూ బ్రిడ్జి జంక్షన్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు రెండున్నర కిలోమీటర్ల నిర్మించిన బెంజ్ ఫ్లైఓవర్-2 నిర్మాణానికి రూ.88 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసింది.
బెంజ్ సర్కిల్ వద్ద వాహనాలు నిలువకుండా కోల్‌కతా-విశాఖపట్నం జాతీయ రహదారి-16 పైకి వెళ్లేందుకు వీలు కల్పిస్తుంది. బెంజి సర్కిల్ ఫ్లై ఓవర్ ప్రారంభమైతే బెంజ్ సర్కిల్, నిర్మలా కాన్వెంట్ సెంటర్, రమేష్ హాస్పిటల్ జంక్షన్ వద్ద రోజువారీ ట్రాఫిక్ ఇబ్బందులను పరిష్కరించడంలో సహాయపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తవడంతో వీఐపీలు, ఇతర ఉన్నతాధికారులు గన్నవరంలోని విమానాశ్రయానికి సజావుగా చేరుకోవడానికి సులువుగా ఉంటుంది. వీఐపీల పర్యటనల సమయాల్లో ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సిన అవసరం ఉండదు. కాని తాజా ఘటనతో వాయిదా పడ్డ బెంజి సర్కిల్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ప్రారంభోత్సవం మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారన్నది ప్రకటించలేదు.