Tirumala Accommodation: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala Tirupati Devasthanam: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీవారి ఆలయంలో 2022 జనవరి 13న వైకుంఠ ఏకాదశి, జనవరి 14న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకొని జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు వసతి గదుల అడ్వాన్స్ రిజర్వేషన్‌ను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తుల వసతికి పెద్దపీట వేస్తూ తిరుమలలోని అన్ని గదులను కరెంటు బుకింగ్ ద్వారా కేటాయించాలని టీటీడీ నిర్ణయించింది.
ఎమ్‌బీసీ 34, కౌస్తుభం విశ్రాంతి భవనం, టీబీసీ కౌంటర్, ఎఆర్‌పీ కౌంటర్లలో 2022 జనవరి 11వ తేదీ తెల్లవారు జామున 12 గంటల నుంచి 14వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు గదులు కేటాయింపు రద్దు చేశారు. జనవరి 11 నుంచి 14వ తేదీ వరకు దాతలకు గదుల కేటాయింపు ప్రివిలేజ్ ఉండదు. శ్రీవారి దర్శనార్థం వచ్చే ప్రముఖులకు వెంకట కళానిలయం, రామరాజ నిలయం, సీతా నిలయం, సన్నిధానం, గోవింద సాయి విశ్రాంతి గృహాల్లో అలాట్‌మెంట్ కౌంటర్లు ఏర్పాటుచేసి గదులు కేటాయిస్తారు. ప్రముఖులకు గరిష్టంగా 2 గదులు మాత్రమే కేటాయిస్తారు. సామాన్య భక్తులకు సీఆర్‌వో జనరల్ కౌంటర్ ద్వారా గదులు మంజూరు చేస్తారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఈ విషయం గుర్తించాలని టీటీడీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మరోవైపు, తిరుమలలో శ్రీవారి భక్తులకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. కాంట్రాక్ట్ కార్మికులు టీటీడీ కార్పొరేషన్‌లో కలపాలంటూ ఆందోళన చేస్తున్నారు. దీంతో తిరుమలలో పారిశుద్ధ్య పనులు నిలిచిపోవడంతో గదుల కోసం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు టీటీడీ అధికారుల ఒత్తిడితో కాంట్రాక్టర్ సంస్థలు గదులను ఒరకొరగా శుభ్రం చేయిస్తున్నాయి. ఉదయం 6 గంటల నుంచి వేచి ఉన్నా గదులు కేటాయించడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. గదుల కేటాయింపుపై భక్తులు దాదాపుగా రెండు గంటల సమయం పాటు వేచి ఉండాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే, నిరసనలో ఉన్న కార్మికులు వెంటనే విధుల్లో చేరకపోతే వారిని తొలగించి కొత్తవారిని నియమించుకోవాలని ఆ ప్రైవేటు సంస్థను టీటీడీ ఆదేశించింది.