తమిళనాడు తిరునెల్వేలిలో విషాదం చోటుచేసుకుంది. ఓ పురాతన పాఠశాలలో ఊహించని ప్రమాదం జరిగింది. టాయిలెట్ గోడ కూలిపోయి ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు. మరో ఇద్దరు స్టడెంట్స్ తీవ్రంగా గాయపడ్డారు. తిరునెల్వేలి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు సమీపంలోని స్కాఫ్టర్ హైస్కూల్ అత్యంత పురాతనమైంది. శుక్రవారం ఉదయం.. స్కూల్‌లోని టాయిలెట్ గోడ కూలిపోయింది. అక్కడే ఉన్న ముగ్గురు 8వ తరగతి విద్యార్థులపై శిథిలాలు పడటం వల్ల తీవ్రంగా గాయపడి స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరో ఇద్దరు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంబంధిత అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి.. దర్యాప్తు చేపట్టారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకుంది. మరోవైపు.. 100 ఏళ్లకుపైగా నడుస్తోన్న స్కూల్లో బిల్డింగ్స్, గోడలు శిథిలావస్థకు చేరుకున్నా.. వాటిని పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు. విద్యార్థుల నిండు భవిష్యత్‌కు బాటలు పరుచుకునే చోట.. వారి జీవితాలు అంతమైన ఘటన అందర్నీ కన్నీరు పెట్టిస్తుంది.
విద్యార్థుల మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సంతాపం తెలిపారు. బాధితుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.