సీఎం ప్రకటించినా.. ఉద్యోగ సంఘాలు మాత్రం ఏమాత్రం తగ్గేది లేదంటున్నాయి. మరో పది రోజుల్లో పీఆర్సీ ప్రకటన చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు తమ కార్యాచరణకు దిగుతున్నారు. తిరుపతిలో పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ చేసిన కామెంట్లపై స్పందించిన ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు బొప్పరాజు, ఫ్యాప్టో అధ్యక్షుడు శ్రీధర్… మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందని ప్రకటించారు…
మరోవైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం అయింది. ఈ సమావేశం పీఆర్సీ అంశం మీద మాత్రమే అంటోంది ప్రభుత్వం. పీఆర్సీ సహా మిగిలిన డిమాండ్ల పైన చర్చించాల్సిందేనంటోన్నాయి ఉద్యోగ సంఘాలు. వారం రోజుల సమయం పడుతుందని ఇప్పటికే ఉద్యోగ సంఘాలకు స్పష్టం చేశారు సీఎం జగన్.
ఇదే విషయాన్ని సమావేశంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చించనుంది ప్రభుత్వం. 55 శాతానికి పైగా పీఆర్సీని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి ఉద్యోగ సంఘాలు. 30 శాతం మేర పీఆర్సీని ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సచివాలయ వర్గాల సమాచారం. పీఆర్సీ నివేదికను తమకు ఇవ్వాల్సిందిగా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వాన్ని కోరనున్నాయి ఉద్యోగ సంఘాలు. మొత్తం మీద పీఆర్సీ పీటముడి ఎప్పుడు వీడుతుందో చూడాలి.