- 24 గంటల్లోగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సుప్రీం
దిల్లీ: గత కొద్దివారాలుగా దిల్లీని వాయు కాలుష్యం వేధిస్తోంది. కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. గురువారం విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. ‘వాటి వల్ల ఏమీ జరగడం లేదని, కాలుష్యం పెరుగుతూనే ఉందని మేం భావిస్తున్నాం. సమయం మాత్రమే వృథా అవుతుంది’ అంటూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిశ్రమలు, వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్రం, దిల్లీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
అలాగే పాఠశాలలు ప్రారంభించడంపై దిల్లీ ప్రభుత్వాన్ని మందలించింది. ‘మూడు, నాలుగు సంవత్సరాల పిల్లలు పాఠశాలలకు వెళ్తుంటే.. పెద్దలు ఇంటి నుంచి పని చేస్తున్నారు’ అంటూ అసహనం వ్యక్తం చేసింది. పిల్లలు నేర్చుకునే ప్రక్రియలో వెనుకబడిపోతున్నారని, అనేక చర్చల అనంతరం.. ఆన్‌లైన్ బోధన ఆప్షన్‌తోనే పాఠశాలల ప్రారంభానికి అనుమతి ఇచ్చినట్లు దిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ‘ఆన్‌లైన్ బోధనను మీరు ఆప్షన్‌కు వదిలేశారు. కానీ, ఇంట్లో ఎవరు కూర్చోవాలనుకుంటున్నారు. మన ఇంట్లో కూడా పిల్లలున్నారు. కరోనా మహమ్మారి వచ్చిన దగ్గరినుంచి వాళ్లకు ఎదురవుతున్న సమస్యలను మనం చూస్తూనే ఉన్నాం. మీరు ఎలాంటి చర్యలు తీసుకోకపోతే.. మేం కఠిన చర్యలు తీసుకుంటాం. మీకు 24 గంటల సమయం ఇస్తున్నాం’ అంటూ ప్రధాన న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
‘అలాగే ఈ సంక్షోభంపై విచారణ ప్రారంభమైనప్పుడు కాలుష్యం ఒక స్థాయిలో ఉంది. మీరు ఇప్పుడు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎందుకు పెరుగుతోంది. ఇది ఒక సాధారణ పౌరుడు అడిగే ప్రశ్న. ఎవరూ ఆ నిబంధనల్ని పాటించడం లేదు. ప్రచారం కోసం మాత్రం పర్యావరణాన్ని కాపాడాలంటూ బ్యానర్లు పట్టుకొని ధర్నాలు చేస్తారు’ అని కోర్టు వ్యాఖ్యానించింది.
దిల్లీలో గాలి కాలుష్యం కారణంగా పది రోజుల సెలవుల అనంతరం సోమవారం నుంచి పాఠశాలలు తెరుచుకున్నాయి. అలాగే కాలుష్యం అంశంపై గత నాలుగు రోజులుగా వరుసగా సుప్రీం విచారణ చేపడుతోంది.