Reproductive Technology Bill: సంతాన సాఫల్య కేంద్రాల ఆగడాలకు ఇక కాలం చెల్లినట్టేనా! పార్లమెంటులో ప్రవేశపెట్టిన అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లుతో ఫెర్టిలిటీ సెంటర్లపై కేంద్రం నియంత్రణకు రంగం సిద్ధం చేసింది. తామర తంపరగా పుట్టుకొస్తోన్న సంతాన సాఫల్య కేంద్రాల ముసుగులో జరుగుతోన్న లింగ నిర్ధారణ పరీక్షలకూ ఈ బిల్ చెక్ పెట్టనుంది. సంతానోత్పత్తి కేంద్రాల్లో నిబంధనలను కఠినతరం చేయడం, విలువలతో కూడిన సేవలే లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ బిల్లులో అసలేముంది? పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తోన్న సంతాన సాఫల్య కేంద్రాలకు కేంద్రం చెక్ పెట్టబోతోంది. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన అనధికారిక సెంటర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం సంసిద్ధమైంది. ది అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ బిల్లుతో సంతాన సాఫల్య కేంద్రాలపై నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
సంతాన సాఫల్య కేంద్రాల ద్వారా బిడ్డలను కనే వారికి విలువలతో కూడిన పూర్తి సంరక్షణకు కేంద్రం సర్వసన్నద్ధం అయ్యింది. సంతానోత్పత్తి కేంద్రాల్లో నిబంధనలను కఠినతరం చేయడానికీ, దాతల అండాలు, వీర్యం తదితర విషయాల్లో విలువలతో కూడిన సేవలందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) బిల్లుని తీసుకొచ్చింది.
సంతాన సాఫల్యం పేరుతో జరుగుతున్న మోసాలను అరికట్టేందుకు లోక్‌సభలో ది అసిస్టెడ్ రీ ప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవియా. సంతాన సాఫల్య కేంద్రాలపై పర్యవేక్షణ, నియంత్రణ కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ఇప్పటి వరకు ఎవరైనా యథేచ్ఛగా ఏఆర్ టీ క్లినిక్‌ని తెరవవచ్చు. అందుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. దీంతో దేశ వ్యాప్తంగా వీధికో సెంటర్ వెలుస్తోంది. వాటిలో కనీస నిబంధనలు పాటించిన దాఖలాల్లేవు. అంతేకాదు అనేక కుటుంబాల్లో సరోగసీ పేరుతో స్త్రీలపై ఒత్తిడి పెరుగుతోంది. ఇదే విషయాన్ని లోక్‌సభలో ప్రస్థావించారు వైసీపీ ఎంపీ నవనీత్ కౌర్.
సరోగసీ రూపంలో ఇతరులకు పిల్లల్ని కనిపెట్టాలంటూ పురుషుల ఒత్తిడిని అరికట్టాలనీ, అందుకు చర్యలు తీసుకోవాలని కౌర్ స్పష్టం చేశారు. ఇక సంతాన సాఫల్య కేంద్రాల రిజిస్ట్రేషన్ కాల పరిమితి ఐదేళ్లు ఉంటుంది. నిబంధనలను ఉల్లంఘిస్తే ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ రద్దు చేసే అధికారం ఉంటుంది.
అండదాతలు, వీర్యదాతల నుంచి అండ-వీర్య సేకరణ రిజిస్టర్డ్ బ్యాంకుల్లోనే జరగాలన్న నిబంధన ఉంది. 21-55 ఏళ్ల మధ్య వయస్సులోని మగవారి నుంచి వీర్య సేకరణ జరపాలి, 23-35 ఏళ్ల మధ్య వయస్సున్న ఆడవారి నుంచి అండం సేకరించాలి. ఒక మహిళ ఒకసారి మాత్రమే అండదానం చేయాలి. ఒకరి నుంచి 7కు మించి అండాలు సేకరించడానికి వీల్లేదు.
నిబంధనలు ఉల్లంఘించిన వారికి 8 – 12 ఏళ్లపాటు జైలు శిక్ష, తొలిసారి నేరానికి పాల్పడితే రూ.5-10 లక్షల జరీమానా విధిస్తారు. నేరాలు పునరావృతమైతే రూ. 10 – 20 లక్షల వరకు జరిమానా విధిస్తారు. లింగ నిర్థారణతో శిశువులను అందిస్తామంటూ ఎవరైనా ప్రకటలు, ప్రచారం చేసుకుంటే 5-10 ఏళ్ల జైలు, రూ. 10-25 లక్షల వరకు జరిమానా విధిస్తారు.
ఈ బిల్లు తీసుకురావడంలో మరో ప్రధాన ఉద్దేశ్యం సంతాన సాఫల్య కేంద్రాల్లో విచ్చలవిడి దోపిడీ జరుగుతోంది. ఏకీకృత ఫీజుల విధానం, ప్రైవేటు దోపిడీని అరికట్టడంపై ఈ బిల్లు కేంద్రీకరించింది. అలాగే చట్టవ్యతిరేకంగా లింగ నిర్ధారణ పరీక్షలు సైతం ఇలాంటి కేంద్రాల్లో చాలా చోట్ల యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ చట్టం ద్వారా వీటన్నింటిపై కేంద్రం నిఘా పెట్టనుంది.