కరోనా వేరియంట్లు ప్రపంచ వ్యాప్తంగా సృష్టిస్తున్న గందరోగోళం అంతాఇంతా కాదు. కొత్త కొత్త వేరియంట్‌లతో కరోనా రూపాలు మార్చుకొని ప్రజలపై దాడి చేస్తోంది. ఇప్పుడు దక్షిణాఫ్రికాలో బయటపడ్డ మరో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం ఇప్పటికే పలు దేశాలపై దండయాత్రను మొదలు పెట్టింది. అంతేకాకుండా ఇటీవలే ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి కూడా ప్రవేశించింది. ఈ నేపథ్యంలో భారత్‌కు థర్డ్ వేవ్ తప్పదని కాన్పూర్ ఐఐటీ ఫ్రొఫెసర్ మనీంద్ర అగర్వాల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
రానున్న రోజుల్లో కరోనా కేసులు భారీ పెరిగే అవకాశం ఉందని, జనవరి, ఫిబ్రవరిలో థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన వెల్లడించారు. అయితే ఫిబ్రవరిలో గరిష్టస్థాయికి చేరుకోవచ్చని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. రోజుకు సుమారు 1.50 లక్షల వరకు కరోనా కేసులు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీన్ని అధిగమించడానికి రాత్రి కర్ఫ్యూ, జనసమూహాలను నియంత్రించడం ద్వారా ఒమిక్రాన్ వేరియంట్‌ను నియంత్రించవచ్చని ఆయన పేర్కొన్నారు.