ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ సర్పంచులు ఆందోళనకు దిగుతున్నారు. పలుచోట్ల నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. అసలే నిధులు లేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేకపోతున్న తరుణంలో కేంద్రం నుంచి వచ్చిన నిధులను ఏపీ ప్రభుత్వం విద్యుత్ బకాయిలకు జమ వేసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థిక కష్టాల్లో పంచాయతీలు.
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం కుమారపురం ఓ మైనర్ పంచాయతీ. సుమారు 3వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో ఓటర్ల సంఖ్య 2వేల వరకు ఉంటుంది. ఏటా పంచాయతీకి ఆదాయం రూ.9 లక్షల దాకా వస్తుంది.
కొత్త పాలకవర్గం ఎన్నికైన తర్వాత గ్రామంలో డ్రెయిన్ల నిర్మాణం కోసం రూ. 8లక్షలు ఖర్చు చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తాయని వారు ఆశగా ఉన్నారు. కానీ, అవి రాగానే రాష్ట్ర ప్రభుత్వం రూ. 11 లక్షలను విద్యుత్ బకాయిలుగా జమ చేసుకుంది. 15వ ఆర్థిక సంఘం నిధుల విషయంలో కూడా తమకు అవకాశం ఇవ్వలేదని సర్పంచ్ ఎన్. రామారావు తెలిపారు.
‘‘14వ ఆర్థిక సంఘం నిధులు రాగానే పాత బకాయిలకు జమ చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ నిధులు వచ్చాయి. కానీ మాకు తీసుకునే అవకాశం ఇవ్వడం లేదు. పనులు చేసిన వాళ్లు ఇబ్బంది పడుతున్నారు. ఇన్నాళ్లు నిధులు రాలేదని బాధపడ్డాం. వచ్చిన నిధులను పాత బకాయిలని తీసేసుకుంటే 15వ ఆర్థిక సంఘం నిధుల కోసం ఎదురుచూశాం. ఇప్పుడు అవి వచ్చినా మాకు అవకాశం ఇవ్వలేదు’’ అని రామారావు బీబీసీకి వివరించారు.
ఇది ఈ ఒక్క పంచాయతీ సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలో 13,369 గ్రామ పంచాయతీలుండగా అందులో మేజర్ పంచాయతీల కన్నా మైనర్ పంచాయతీలే ఎక్కువ. దాదాపుగా అన్ని మైనర్ పంచాయతీల్లో ఇలాంటి సమస్యలున్నాయి. నిధుల లేమితో సతమతమవుతున్నాయి.
ఇటీవల జనరల్ ఫండ్స్‌తో పాటుగా 14,15వ ఆర్థిక సంఘం నిధులు కూడా తమకు చేరడం లేదని ఆయా పంచాయతీ పాలక వర్గాలు వాపోతున్నాయి.