ముఖ్యమంత్రి జగన్. ఒంటరిగా పార్టీ ఏర్పాటు చేసారు. ఒంటి చేత్తో ఆ పార్టీని అధికారంలోకి తెచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ప్రజలను ఒప్పించారు. తన మాటలతో మెప్పించారు. పార్టీ అధినేతగా తిరుగులేదు. ప్రభుత్వాధినేతగా పాలనలో ఆయనవే తుది నిర్ణయాలు. 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజున జగన్ తన తొలి సందేశంలో ఆరు నెలల కాలంలో తానేంటో..తన పాలన ఏంటో చూస్తారని చెప్పారు. తన తండ్రి కంటే ఒక అడుగు ముందుకేస్తానని చెప్పుకొచ్చారు. అవినీతి లేని పాలన కొనసాగుతుందని మాట ఇచ్చారు. రెండున్నారేళ్లు అయింది. జగన్ పాలనా పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు.
ఏపీ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది
రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. పాలన పరమైన సమస్యలు ఇప్పుడు సాధారణ ప్రజల్లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. సంక్షేమ పధకాలనే నమ్ముకున్న జగన్.. నవరత్నాల విషయంలో మాత్రం ఎక్కడా పొరపాటు జరగకుండా..చెప్పిన తేదీకి ఎన్ని కష్టాలు వచ్చినా అమలు చేసి తీరుతున్నారు. లబ్దిదారుల్లో మాత్రం మంచి పేరు సంపాదించారు. కానీ, రాష్ట్రాన్ని ఆర్దికంగా వెంటాడుతున్న కష్టాలు మొత్తం అంచనాలనే తారు మారు చేస్తున్నాయి. ఆరు నెలల కాలంలో మూడు లక్షల కోట్లు జగన్ పాలనా సామర్ధ్యం పైన ప్రభావం చూపుతోది.
ఆర్దిక కష్టాలతో పట్టు తప్పుతోందా
రాష్ట్రంలో ప్రభుత్వ ఆదాయం కష్టంగా మారుతోంది. పోలవరం ఆలస్యం కావటం జగన్ కు రాజకీయంగా నష్టం చేసే పరిస్థితి కనిపిస్తోంది. రాజధాని పైన స్పష్టత లేదు. ఇదే సమయంలో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వానికి డెడ్ లైన్లు పెడుతున్నారు. ఉద్యోగులకు ప్రతీ నెలా ఒకటో తేదీన జీతాలు..పెన్షనర్లకు పెన్షన్ పొందటం వారి హక్కు. అదే విధంగా వారికి వాటిని అందించటం ప్రభుత్వ బాధ్యత. అక్టోబర్ నెలాఖరుకే పీఆర్సీ పైన స్పష్టత ఇస్తామని చెప్పి ప్రభుత్వం..మాట తప్పటం ఇప్పుడు వారు రాజకీయంగానూ ప్రభుత్వాన్ని కూల్చే శక్తి తమకుందని వ్యాఖ్యలు చేయటానికి అవకాశంగా మారింది.
ఉద్యోగ సంఘాలతో గ్యాప్ వెనుక
151 సీట్లు తామే తీసుకొచ్చినట్లుగా ఉద్యోగ సంఘాల నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడే బాధ్యత ఇప్పటి వరకు ఏ మంత్రికి ఎందుకు అప్పగించలేదంటే దానికి ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులతో నిరంతరం సంప్రదింపుల కోసం ఏ మంత్రి ముందుకు రాలేదు. ముఖ్యమంత్రి వారం..పది రోజుల్లో పీఆర్సీ పైన నిర్ణయం తీసుకుంటామని చెప్పినా..ఉద్యోగ సంఘాల్లో నమ్మకం కలగటం లేదా. లేక, తామే ప్రభుత్వాన్ని నిలబెట్టగటం.. కూల్చగలం అంటూ వ్యాఖ్యలు చేయటం ప్రభుత్వాన్ని పరోక్షంగా హెచ్చరించటమేనా అనే చర్చ వినిపిస్తోంది.
మంత్రులు జోక్యం చేసుకోరా..చేసుకోనీయరా
అయితే, ఇప్పటికే 27 శాతం ఐఆర్ అమలు చేస్తున్నా...అయిదు డీఏలు పెండింగ్ పెట్టింది. గతంలో వైఎస్సార్ .. చంద్రబాబు హాయంలో ఉద్యోగులతో పీఆర్సీ ఇతర సమస్యల పైన అధికారులు - మంత్రులతో కమిటీ పని చేసేది. ఇప్పుడు ఆ చొరవ కనిపించటం లేదు. ఫలితంగా ఉద్యోగుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఉద్యోగ సంఘాల నేతలు డెడ్ లైన్లు..ప్రభుత్వాన్ని కూల్చే శక్తి ఉందంటూ పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ స్థాయిలో వ్యాఖ్యలు వినిపించటం ఇదే తొలి సారి.
ఎక్కడ లైన్ తప్పుతోంది..
వీరి సమస్యల పైన ప్రభుత్వంలో స్పష్టత లేదా.. లేక, ఉద్యోగ సంఘాలతో చర్చలను అధికారులు లైట్ తీసుకున్నారా. మూడు సార్లు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగిన తేల్చింది ఏంటి. సీఎం జగన్ స్వయంగా వారం పది రోజుల్లోనే పీఆర్సీ ప్రకటన ఉంటుందని చెప్పినా.. ఉద్యోగ సంఘాల నేతలు ఈ స్థాయిలో వ్యాఖ్యలు చేయటం వెనుక ఏదైనా రాజకీయ ప్రోద్భలం ఉందా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. మూడు రాజధానుల విషయంలో బిల్లుల రూపకల్పనలో సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని స్వయంగా ప్రభుత్వం శాసనసభలో చెప్పింది.
సీఎం జగన్ ఏం చేయనున్నారు
కీలకమైన బిల్లుల విషయంలోనూ అధికారులు ఈ రకంగా వ్యవహరిస్తున్నారా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. తాజాగా, వరదల సమయంలో అన్నమయ్య ప్రాజెక్టు నిర్వహణ పైన ఢిల్లీ స్థాయి నుంచి ప్రభుత్వ అధికారుల సమర్ధత పైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ పరోక్షంగా జగన్ నాయకత్వానికి..పాలనా సమర్దతకు పరీక్షగా మారే అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పాలనా పరంగా పట్టు జారుతున్నారా అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో...ఇప్పుడు పార్టీలోనూ..ప్రభుత్వ వర్గాల్లో జరుగుతున్న ఈ చర్చకు జగన్ తన నిర్ణయాలు.. పని తీరు ద్వారా ఏ విధంగా సమాధానం చెబుతారనేది ఆసక్తి కరంగా మారుతోంది.