Trending

6/trending/recent

Aided Schools: 40 లోపుంటే రద్దే

  • ఎయిడెడ్‌ బడుల యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులు

రాష్ట్రంలో 418 ఎయిడెడ్‌ పాఠశాలల అనుమతులను రద్దు చేసేందుకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. 40లోపు విద్యార్థులున్న వీటిని మూసివేసేందుకు నివేదికలు కోరింది. రెండేళ్లుగా పిల్లల ప్రవేశాలు తగ్గడం, ఈ ఏడాది అక్టోబరు 31వరకు అవకాశం కల్పించినా ప్రవేశాలు పెరగకపోవడంతో వీటిపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 2019-20, 2020-21 సంవత్సరాల్లో 840 పాఠశాలల్లో పిల్లల సంఖ్య తగ్గిందని, ఈ ఏడాది అక్టోబరు 31నాటికి ఉన్న ప్రవేశాలను పరిశీలించగా.. 418 బడులు ఈ ఏడాదీ పిల్లల సంఖ్యను పెంచడంలో విఫలమయ్యాయని పేర్కొంది. విద్యాహక్కు చట్టం, ఉత్తర్వు-1 నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునేందుకు నివేదికలు పంపాలని సూచించింది. ఉత్తర్వు-1 ప్రకారం 40మంది విద్యార్థులకు ఒక టీచర్‌ ఉండాలి. ఈ పాఠశాలల్లో 40మందిలోపు విద్యార్థులు ఉన్నందున వీటన్నింటి అనుమతులను రద్దు చేసే అవకాశముంది. ఇప్పటికే 20లోపు విద్యార్థులున్న బడుల అనుమతులను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

కృష్ణాలో అత్యధికం..

40మందిలోపు విద్యార్థులుండి మూతపడే 418 పాఠశాలల్లో అత్యధికంగా 133 బడులు కృష్ణా జిల్లాలోనే ఉన్నాయి. అత్యల్పంగా 4 పాఠశాలలు అనంతపురంలో ఉన్నాయి. వీటిల్లోని కొన్ని పాఠశాలల్లో సున్నా ప్రవేశాలున్నాయని ఇప్పటికే ఉపాధ్యాయులను వేరే బడులకు సర్దుబాటు చేశారు. 20లోపున్న వాటి అనుమతుల రద్దుకు యాజమాన్యాలకు షోకాజ్‌ నోటీసులిచ్చారు. ఇప్పుడు 40లోపున్న వాటిని ఈ విద్యా సంవత్సరంలో మూసివేస్తారా? లేదంటే వచ్చే ఏడాది నుంచి అనుమతులు నిలిపివేస్తారా? అనే దానిపై సందిగ్ధం నెలకొంది.


Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad