- తరగతులు విలీనమైనచోట నిర్మాణాలు
నూతన విద్యావిధానం అమలులో భాగంగా 3,4,5 తరగతులను కలిపిన ఉన్నత పాఠశాలలకు అదనపు తరగతి గదులు నిర్మించాలని నిర్ణయించారు. జిల్లాలో ఎక్కడ ఎంతమంది విద్యార్థులున్నారు? ఎన్ని గదులు నిర్మించాలనే నివేదిక సిద్ధం చేసి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయానికి సమర్పించారు. గురువారం విజయవాడలో ప్రాథమిక విద్య కమిషనర్ సమీక్ష నిర్వహించగా జిల్లా విద్యాశాఖ అధికారి బి.విజయభాస్కర్, ఏపీసీ శ్రీనివాసులు హాజరయ్యారు.
198 ఉన్నత పాఠశాలల్లో విలీనం..
216 ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతుల విద్యార్థులను 250 మీటర్ల పరిధిలోగల 198 ఉన్నత పాఠశాలల్లో విలీనం చేశారు. వారికి ఇకపై సబ్జెక్టు టీచర్లు బోధిస్తారు. 380 మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నత పాఠశాలల్లో చేరారు. వారంతా సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు అయినప్పటికీ విద్యార్హతలను బట్టి ఆయా సబ్జెక్టులు బోధించాలని ఆదేశాలిచ్చారు. ఎక్కడైనా కొరత ఉంటే త్వరలో పదోన్నతులు నిర్వహించి ఎస్జీటీల్లో అర్హులైన వారికి స్కూలు అసిస్టెంట్లుగా నియమిస్తారు. ఇకపై ఆన్‌లైన్ ద్వారానే పదోన్నతులు చేపడతారు. మధ్యాహ్న భోజనంతోపాటు ఇతర సమయాలు కూడా ఉన్నత పాఠశాల మాదిరిగానే అమలు చేయాలని స్పష్టత ఇచ్చారు.
ప్రత్యేక నిధుల కేటాయింపు:
తరగతులు విలీనమైన ఉన్నతపాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణానికి నాడు-నేడుతో సంబంధం లేకుండా ప్రత్యేక నిధులు మంజూరు చేస్తారు. వసతి గృహాలు ఉన్న జిల్లాలోని ఆరు మోడల్ పాఠశాలల్లో ఆగస్టు నుంచి పెండింగులో ఉన్న బిల్లులను చెల్లించడానికి సీఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌కు అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.