omicron variant | కరోనా వైరస్ మరోసారి విజృంభిస్తుంది. ఒమిక్రాన్ వేరియంట్‌గా పరివర్తనం చెంది ప్రపంచ దేశాలను వణికిస్తోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇది అత్యంత ప్రమాదకరమైనదని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వేరియంట్ చాలా వేగంగా వ్యాపించగలదని.. రోగ నిరోధక శక్తిని కూడా ఇది ఏమార్చగలదని భయపడుతున్నారు. ఇలాంటి సమయంలో అసలు ఒమిక్రాన్ వేరియంట్ ఎలా ప్రభావం చూపుతుంది? ఇప్పటివరకూ మనం చూసిన వేరియంట్లతో పోలిస్తే ఇది ఎందుకు అంత ప్రమాదకరమనేది మాత్రం చాలామందికి అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ గురించి వైరాలజిస్టులు కాస్త క్లారిటీ ఇచ్చారు.
రెండు వారాలు ఆగితేనే తెలుస్తుంది
ఇప్పటివరకు ఉన్న వేరియంట్లతో పోలిస్తే ఇది మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉన్నదని భారత్‌లోని టాప్ మైక్రో బయాలజిస్ట్, వైరాలజిస్ట్‌ల్లో ఒకరైన గగన్ దీప్ తెలిపారు. ఇప్పటివరకు గుర్తించిన దాని కంటే ఎక్కువ ప్రాంతాలకు ఈ వేరియంట్ వైరస్ వ్యాపించి ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రస్తుతానికి ఈ వేరియంట్ గురించి పూర్తి సమాచారం తెలియదని.. దీని గురించి అంచనా వేసేందుకు ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పారు. మరో రెండు వారాల్లో పూర్తి సమాచారం తెలుస్తుందని.. అప్పుడు ఈ వేరియంట్ పనితీరు పూర్తిగా అర్థమవుతుందని క్లారిటీ ఇచ్చారు. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు ప్రయాణ ఆంక్‌షలు మాత్రమే సరిపోవన్నారు. వైరస్ ప్రభావానికి లోనయ్యే అవకాశం ఉన్న వారిని గుర్తించి చికిత్స అందించేందుకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులకు బూస్టర్ డోస్ ఇవ్వాల్సిందేనని చెప్పారు. ప్రస్తుతం వెల్లూర్ క్రిస్టియన్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.
మాస్కులు.. జేబులో ఉన్న వ్యాక్సిన్లు
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ నేపథ్యంలో కట్టుదిట్టమైన కొవిడ్ నిబంధనలు పాటించడం తప్పనిసరి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ హెచ్చరించారు. వైరస్ కట్టడికి మాస్కులే బ్రహ్మాస్త్రాలని.. మాస్కులు జేబులో ఉన్న వ్యాక్సిన్లు అని ఆమె అభివర్ణించారు. వ్యాక్సినేషన్‌కు అత్యంత ప్రాముఖ్యత ఇవ్వాలని సూచించారు. ఒమిక్రాన్ వేరియంట్ స్వభావాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాల్సి ఉంటుందని.. దీనికి మరింత సమయం పడుతుందని ఆమె చెప్పారు.
వేరియంట్ గురించి తెలుసుకుంటున్నాం
రోగనిరోధకత నుంచి ఒమిక్రాన్ వేరియంట్ తప్పించుకోగలదని వస్తున్న వార్తలపై అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ స్పందించారు. దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చిన ఈ వేరియంట్‌పై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.. కానీ వేరియంట్ దక్షిణాఫ్రికాలో ఇంకా అస్పష్టంగానే ఉందని చెప్పారు. ఈ వేరియంట్ స్వభావానికి సంబంధించిన వాస్తవాలు.. యాంటీబాడీల నుంచి తప్పించుకోగలదా? అన్న అంశాలపై సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
సమర్థతను పరిశీలిస్తున్నాం ఐసీఎంఆర్
ఒమ్రికాన్ వేరియంట్ స్వభావం, వ్యాక్సిన్ల సమర్థత వంటి అంశాలను పరిశీలిస్తున్నామని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త సమీరన్ పాండ తెలిపారు. ఈ వేరియంట్‌లో ఇతర దేశాల్లోని జన్యుపరమైన వైవిధ్యాలు, నిర్మాణాత్మక మార్పులు కనిపించినట్లు చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ల ప్రక్రియ బలోపేతం చేస్తామని అన్నారు.
ఇక ఇప్పుడు ఉన్న టీకాలు ఒమిక్రాన్ వేరియంట్ నుంచి రక్షణ కల్పిస్తాయని బ్రిటన్ ప్రభుత్వ సైంటిఫిక్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఎమర్జెన్సీస్ మైక్రోబయాలజిస్ట్ ప్రొఫెసర్ కేలమ్ సెంపుల్ అభిప్రాయపడ్డారు. ఈ కొత్త వేరియంట్ కరోనా వ్యాక్సిన్‌ను ఏమారుస్తుందని ఇప్పటికిప్పుడు చెప్పడం తొందరపాటు అవుతుందని అన్నారు. కాగా.. ఒమిక్రాన్ వేరియంట్‌పై కొవిడ్ 19 టీకాలు సమర్థంగా పనిచేస్తున్నాయని దక్షిణాఫ్రికా ఆరోగ్య మంత్రి జో ఫాహ్లా పేర్కొన్నారు.