Krishna Reverse Water Turns Green: కృష్ణానది రివర్స్ వాటర్ ఆకుపచ్చగా మారిపోయింది. గత వారం రోజులుగా ఇదే పరిస్థితి. శ్రీశైలం ప్రాజెక్ట్ తిరుగు జలాలు గ్రీన్ కలర్‌లోకి మారిపోయాయి. దీంతో నదీ తీర ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు..నది వెంట జీవనం సాగిస్తున్నవారు ఆ నీటినే తాగాల్సిన పరిస్థితి. దీంతో అనారోగ్యానికి గురవుతున్నామని..నదిలో చేపలవేటకు ఇబ్బందవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్ వరకు..గత వారం రోజులుగా కృష్ణానది రివర్స్ వాటర్ ఇలా ఆకుపచ్చగా మారుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇలా జరుగుతోందని అంటున్నారు స్థానికులు. నీరు ఆకుపచ్చగా మారడంతో చేపలవేటకు వెళ్లలేకపోతున్నామని..చేపలు కూడా చనిపోయే ప్రమాదముందని వాపోతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలతోనే నీరు ఇలా ఆకుపచ్చగా మారుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.