ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక ఉన్నట్లు ఫేస్‌బుక్‌లో సర్క్యూలేట్ అవుతున్న వార్తపై కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆరోగ్య రంగ గౌరవాన్ని ప్రభావితం చేసే నిరాధారమైన పోస్ట్ చేయడం ఆపాలని పిలుపునిచ్చింది. మెర్ల్ కొమ్సన్ అనే ఫేస్‌బుక్ పేజీలో భుజంలో బొద్దింకతో ఉన్న మానవుడి ఎక్స్-రే చిత్రంతోపాటు కథనాన్ని పోస్ట్ చేసింది. ప్రే వెంగ్ ప్రావిన్స్‌లో నివసిస్తున్న ఓ వ్యక్తి శరీరంలో బొద్దింక నివసిస్తోందని, దీంతో అతడి భుజం నొప్పిగా ఉందని ఓ వైద్యుడు చెప్పాడని కథనంలో పేర్కొంది. ఆ వ్యక్తి వైద్య చికిత్స కోసం భారతదేశానికి వెళ్లాడని, అక్కడ వైద్యులు అతని శరీరంలో బొద్దింక లేదని చెప్పారని తెలిపింది. కంబోడియాలో వైరల్‌గా మాారిన ఈ ఫేస్‌బుక్ పోస్ట్ ఫేక్ అని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ పోస్ట్ ఇండియాలో కూడా వైరల్ అయింది. వాట్సాప్, ఫేస్‌బుక్‌లో ఈ వార్తను సర్క్యూలేట్ చేస్తున్నారు.
“ఆరోగ్య రంగం గౌరవాన్ని కాపాడుకోవాలని, ఫేస్‌బుక్ వినియోగదారులు నిరాధారమైన సమాచారాన్ని పోస్ట్ చేయడం లేదా వాస్తవాలను తప్పుగా సూచించడం ఆపాలని” అని మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. “ఇది జాతీయ ఆరోగ్య రంగం గౌరవాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పింది. ఫేక్ న్యూస్ స్టోరీని పోస్ట్ చేసినందుకు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆరోగ్య రంగంలో ఎవరైనా నిజమైన సమస్యలు ఎదుర్కొంటే, కేసుకు సంబంధించిన సమాచారాన్ని మంత్రిత్వ శాఖ లేదా ప్రాంతీయ ఆరోగ్య విభాగానికి అందించాలని – దాని గురించి ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయవద్దని కంబోడియా మంత్రిత్వ శాఖ ప్రతినిధి లై సోవాన్ చెప్పాడు.
“ప్రజలు నిజమైన దానిని మాత్రమే ప్రచారం చేయాలి. ఏదైనా వైద్యుడి లేదా ఆస్పత్రి పొరపాటు ఉంటే, దయచేసి డాక్టర్ పేరు, వారు ఏ ఆసుపత్రి లేదా ఆరోగ్య కేంద్రంలో పని చేస్తారు. అనే వివరాలతో ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం”అని చెప్పాడు.
ఫేస్‌బుక్ పేజీ నిర్వహణ బృందం తమ పేజీలో బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఎక్స్-రే చిత్రం ప్రే వెంగ్ ప్రావిన్షియల్ ఆసుపత్రి లేదా కంబోడియాలోని ఏదైనా ప్రాంతీయ ఆసుపత్రిది కాదని పేర్కొంది. తమ బృందం కథనం, ఫోటోను మరొక ఫేస్‌బుక్ ఖాతా నుండి కాపీ చేసినట్లు చెప్పింది. “ఈ పోస్ట్‌పై మా బృందం ప్రజలకు క్షమాపణలు చెప్పాలనుకుంటోంది. దీన్ని ఇప్పటికే తొలగించాము” అని పేర్కొంది. “క్షమించండి, సమాచారాన్ని తప్పుదోవ పట్టించే ఉద్దేశం మాకు లేదు. భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయమని హామీ ఇస్తున్నాం” అని చెప్పింది.