Trending

6/trending/recent

Quality Check: ‘నాడు-నేడు’లో ఫ్యాన్ల నాణ్యత పరిశీలన

  • విశ్వవిద్యాలయాలకు పంపిస్తున్న అధికారులు

Quality Check: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చేపట్టిన ‘నాడు-నేడు’ పనుల్లో భాగంగా సరఫరా చేసిన ఫ్యాన్లపై విద్యాశాఖలో వివాదం కొనసాగుతోంది. దీనికి సంబంధించి ప్రాజెక్టు పర్యవేక్షణ కమిటీ సీఎం కార్యాలయానికి ఫిర్యాదు చేయడంతో ఆయా ఫ్యాన్ల నాణ్యత, స్పెసిఫికేషన్లను పరీక్షించేందుకు వాటిని విశ్వవిద్యాలయాలకు పంపిస్తున్నారు. ఒక్కో జిల్లా నుంచి 10 ఫ్యాన్ల చొప్పున, చిత్తూరు జిల్లా నుంచి 14 ఫ్యాన్లను, ‘నాడు-నేడు’ పనులు చేపట్టిన ఒక్కో ఇంజినీరింగ్‌ విభాగం నుంచి 2చొప్పున వీటిని పంపుతున్నారు.

ఏం జరిగిందంటే...

టెండర్ల సమయంలో హైస్పీడ్‌ ఫ్యాన్లను సరఫరా చేయాలని పేర్కొంటూ కొన్ని స్పెసిఫికేషన్లు పెట్టారు. పనులు దక్కించుకున్న గుత్తేదారు సంస్థ హైస్పీడ్‌ కాకుండా కూల్‌బ్రీజ్‌ ఫ్యాన్లను సరఫరా చేసింది. ఇటీవల ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమీక్షలో రాష్ట్ర ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్లు అధికారులు ఈ విషయాన్ని ప్రస్తావించగా... టెండర్‌లో పేర్కొన్న విధంగానే సరఫరా చేశారని, తేడా ఏమి లేదని విద్యాశాఖ అధికారులు సమాధానమిచ్చారు. హైస్పీడ్‌ ఫ్యాన్‌కు ప్రస్తుతం సరఫరా చేసిన దానికి రూ.500 వరకు తేడా ఉంటుందని, ఆ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్‌ అధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. హైస్పీడ్‌ ఫ్యాన్‌ వల్ల చుట్టుపక్కల ఉండే పిల్లలకు గాలి వస్తుందని, ప్రస్తుతం సరఫరా చేసిన ఫ్యాను వల్ల కేవలం దాని కింద కూర్చున్న వారికే గాలి వస్తుందని సీనియర్‌ ఇంజినీర్లు పేర్కొంటున్నారు. ఈ ఫ్యాన్ల సామర్థ్యాన్ని పరిశీలించేందుకు బెంగళూరులోని ప్రయోగశాలకు పంపించాలని ప్రాజెక్టు పర్యవేక్షణ యూనిట్‌ అధికారులు సూచించగా... విద్యాశాఖ వాటిని విశ్వవిద్యాలయాలకు పంపించడం గమనార్హం.

ఒప్పందానికి మించి..

ప్రభుత్వ పాఠశాలలకు మొదట దాదాపు 1.5 లక్షల ఫ్యాన్లు అవసరమవుతాయనే అంచనాతో ఒప్పందం కుదుర్చుకున్నారు. 15 నుంచి 20 శాతం వరకు అధికంగా సంబంధిత గుత్తేదారు నుంచి సరఫరా పొందవచ్చు. అంతకన్నా మించితే కొత్తగా టెండర్లు పిలవాల్సి ఉంటుంది. అధికారులు మాత్రం దాదాపు 3 లక్షల వరకు ఫ్యాన్లు తీసుకున్నారు. వందశాతం అధికంగా తీసుకున్నందున సప్లిమెంటరీ ఒప్పందం కుదుర్చుకోవాలని భావిస్తున్నారు.



Post a Comment

0 Comments

Top Post Ad

https://news.google.com/publications/CAAqBwgKMJfgrgswpOvGAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

Below Post Ad