ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రారంభించిన ‘నాడు-నేడు' కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు.
న్యూస్ టోన్, అమరావతి: ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యాభ్యాసంలో గట్టి పునాదులు వేయడం, ఎఫెక్టివ్ ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ మార్గదర్శక ప్రణాళికపై సీఎం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్బంగా మహిళాభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ అంగన్‌వాడీ ఉపాధ్యాయుల కోసం రూపొందించిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం, సీడీలను సీఎం జగన్ ఆవిష్కరించారు. అంగన్‌వాడీ అభివృద్ధి కమిటి శిక్షణ కోసం రూపొందించిన కరదీపిక నమూనాను అధికారులు సీఎంకు చూపించారు.
అనంతరం సమీక్షలో... రాష్ట్రంలో 10 మంది పిల్లల కన్నా తక్కువగా ఉన్న స్కూళ్లు, అలాగే 30 మంది కన్నా పిల్లలు తక్కువగా ఉన్న స్కూళ్ల గురించి అధికారులు సీఎంకు తెలిపారు. కొన్నిచోట్ల పిల్లల సంఖ్య తక్కువ, టీచర్లు ఎక్కువ ఉన్న స్కూళ్లు కూడా ఉన్నాయని తెలిపారు. స్కూళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి, టీచర్ల సేవలను సమర్థవంతంగా వాడుకోవడానికి జాతీయ మార్గదర్శకాల ప్రకారం అధికారులు కొన్ని ప్రతిపాదనలు చేశారు. విద్యాభ్యాసంలో గట్టి పునాదులకోసం ఈ నిర్ణయాలు ఉపయోగపడతాయని సీఎంకు తెలిపారు.
స్కూళ్ల వారీగా అక్కడున్న విద్యార్థులు, టీచర్ల సంఖ్యను బట్టి మార్పులు చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. పిల్లలు తక్కువుగా ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో అంగన్‌వాడీ పిల్లలను కలుపుకునేట్టుగా చేస్తామన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ప్రస్తుతం ఉన్న టీచర్లు వీరికి విద్యాబోధన చేస్తారన్న అధికారులు.. దీనివల్ల శిక్షితులైన ఉపాధ్యాయులు వారికి ప్రాథమిక దశ నుంచే మంచి బోధన ఇవ్వగలరని, అలాగే స్కూళ్లు కూడా సమర్థవంతంగా వినియోగపడతాయని తెలిపారు. అవకాశం ఉన్న చోట మూడో తరగతి నుంచి ఐదో తరగతి వరకూ కూడా హైస్కూల్ పరిధికి తీసుకురావాలని ప్రతిపాదన చేశారు. అవసరమైన చోట అప్పర్‌ప్రైమరీ స్కూళ్లను హైస్కూళ్లగా మారుస్తామని అధికారులు ప్రతిపాదించారు
ఒక్క స్కూలు కూడా మూతపడకూడదు: సీఎం
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘నాడు-నేడుతో స్కూళ్లు, అంగన్‌వాడీలు అభివృద్ధి అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి స్కూల్ వినియోగంలో ఉండాలి. కొత్తగా చేస్తున్న ప్రతిపాదనల వల్ల ఒక్క స్కూలు కూడా మూతపడే పరిస్థితి రాకూడదు. శిక్షితుడైన టీచర్ పీపీ–1, పీపీ–2 పిల్లలకూ అందుబాటులో ఉండడం ఈ ప్రతిపాదనల్లో ఒక సానుకూల అంశం. అధికారులు మరోసారి కూర్చొని చర్చించి మరింత మంచి ఆలోచనలు చేయాలి. ఈనెలలో మరోసారి దీనిపై సమీక్ష చేద్దాం’’ అని సీఎం జగన్ అన్నారు.
మనిషిని కష్టపెట్టి, బాధపెట్టి.. ఏం సాధించలేం: సీఎం
‘‘ఆప్యాయతతో మన లక్ష్యాలను టీచర్లకు వివరించడం ద్వారా మంచి పని తీరు సాధించుకోగలం. అసహనం ఎప్పుడూ కూడా బయటకు రానివ్వకూడదు. మనం తీసుకుంటున్న విప్లవాత్మక మార్పుల్లో టీచర్ల పాత్ర కీలకం. వారిని ఆప్యాయతతో దగ్గరకు తీసుకోండి... మంచి పనితీరు రాబట్టుకోండి’’ అని సీఎం జగన్ అధికారులకు సూచించారు."
స్కూళ్ళ నిర్వహణలో జాతీయ ప్రమాణాలు పాటించాలి:సీఎం
‘‘స్కూళ్ళ నిర్వహణ, టీచర్లని వినియోగించడంలో జాతీయ ప్రమాణాలను పాటించాలి. పిల్లల సంఖ్యకు తగినట్టుగా టీచర్లు ఉండాలి. పిల్లలకు 2 కి.మీ. దూరం లోపలే బడి ఉండాలి. ఇంతకన్నా ఎక్కువైతే పిల్లలకు భారం అవుతుంది. నాడు– నేడు కింద అన్నిరకాల స్కూళ్లు, అంగన్‌వాడీలను అభివృద్ధిచేస్తున్నాం. ఏ పాఠశాలనూ మూసివేసే పరిస్థితి ఉండకూడదు. అవసరమైన చోట అదనపు తరగతి గదులను నాడు–నేడు కింద నిర్మించండి’’ అని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
అంగన్‌వాడీ టీచర్లకు మంచి శిక్షణ ఇవ్వాలి: సీఎం
‘‘రూపొందించిన పాఠ్యాంశాలను అంగన్‌వాడీ టీచర్లు పిల్లలకు బోధించగలగాలి. పెద్దవాళ్ల పిల్లల మాదిరిగా పేదవాడి పిల్లలు కూడా ఇంగ్లీషులో మంచి విద్యను అందుకోవాలి. దీనికోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకోండి. పాఠ్యప్రణాళిక పటిష్టంగా ఉండాలి. నాడు – నేడు కింద బాగుచేసిన భవనాల నిర్వహణపై దృష్టిపెట్టాలి. ఏం సమయానికి ఏం చేయాలన్న దానిపై ఎస్‌ఓపీ తయారు చేయండి. రూ.వేల కోట్లు ఖర్చు చేశాం కాబట్టి భవనాలను బాగా చూసుకోవాలి’’ అని సీఎం జగన్ సూచించారు.
ఈ సమీక్షా సమావేశంలో విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనూరాధ, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, పాఠశాల విద్యా కమిషనర్ వి.చినవీరభద్రుడు, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ వి.రామకృష్ణ, సర్వశిక్షా అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ వెట్రిసెల్వి, సర్వశిక్షా అభియాన్ సలహాదారు ఎ.మురళితో పాటు, విద్యా శాఖకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.