MPTC ZPTC Elections Cancelled: ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ పరిషత్ ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేసింది. ఎన్నికలు సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం జరగలేదని కోర్టు అభిప్రాయపడింది. మళ్లీ కొత్త నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించింది. పరిషత్ ఎన్నికలను రద్దు చేయాలంటూ జనసేన పార్టీ పిటిషన్ వేసింది.. ఈ పిటిషన్ లో బీజేపీ, టీడీపీలు ఇంప్లీడ్ అయ్యాయి. వీటిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. శుక్రవారం తీర్పును వెలవరించింది. ఏప్రిల్ 1న ఆంధ్రప్రదేశ్ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ.. అదే రోజు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. 2020లో ఎన్నికలు ఎక్కడ నిలిచిపోయాయో.. అక్కడి నుంచే తిరిగి ప్రారంభించాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో 515 జెడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు ఏప్రిల్ 8న ఎన్నికలు జరిగాయి. అదే నెల 10వ తేదీన కౌంటింగ్ జరగాల్సి ఉంది. ఐతే హైకోర్టు కౌంటింగ్ పై స్టే విధించింది. ఈ నేపథ్యంలో జనసేన పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విషయంలో తాను అనుకున్న నిర్ణయాన్ని అమలు చేసిన ప్రభుత్వానికి ఇది ఎదురుదెబ్బగా భావించవచ్చు. ఇప్పటికే ఎన్నికలు పూర్తవడంతో ఫలితాలకు సంబంధించిన డేట్ వస్తుందని భావించింది. ఐతే ఎన్నికల నిర్వహణ విషయంలో నిబంధనలు పాటించని అంశాన్ని జనసేన పార్టీ తరపు న్యాయవాదులు నిరూపించగలిగాయి. వారి వాదనలతో ఏకీభవించిన కోర్టు ఎన్నికలను రద్దు చేస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఎన్నికల ప్రక్రియకు నాలుగు వారాల సమయం ఉండాలని సుప్రీం కోర్టు మార్గదర్శకాలు ఇవ్వగా.. ప్రభుత్వం మాత్రం కేవలం 8 రోజుల్లోనే ముగించింది. దీనిపైనే జనసేన పార్టీ అభ్యంతరం తెలుపుతూ రిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పు వెలువరించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా కారణంగా ఎన్నికలు నిర్వహించే అవకాశం లేదు. కొత్త నోటిఫికేషన్ కు ఇంకా చాలా సమయం పట్టే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఐతే హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ఎన్నికల కమిషన్ డివిజనల్ బెంచ్ లో సవాల్ చేసే అవకాశముంది. ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయనేది ఆసక్తికరంగా మారింది.