ప్రపంచంలోనే అతిపెద్ద టూ వీలర్ తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
భారత మార్కెట్లో రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగనుంది. గత కొన్ని రోజులుగా దేశంలో ఈ–వెహికిల్స్ వినియోగం పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. పెట్రోల్, డీజిల్ ధరతో పాటు కాలుష్యం పెరుగుతుండటంతో ఇప్పుడు అందరి చూపు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రముఖ సంస్థలు సైతం ఎలక్ట్రికల్ వాహనాల తయారీకి మొగ్గుచూపుతున్నాయి. ఇప్పటికే బజాజ్, టీవీఎస్ కంపెనీలు భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తున్నాయి. వీటితో పాటు హోండా, రాయల్ ఎన్ఫీల్డ్ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదలకు సన్నాహాలు చేస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేసే అవకాశం ఉంది. తద్వారా, ఈ రంగంలో తనదైన ముద్ర వేయడానికి హీరో మోటోకార్ప్ సిద్దమవుతోంది.
తాజా ఒప్పందంలో భాగంగా తైవాన్‌కు చెందిన బ్యాటరీ ఎక్స్చేంజ్ నెట్వర్క్ గొగొరో అనే కంపెనీతో హీరో సంస్థ చేతులు కలిపింది. త్వరలోనే ఈ రెండు కంపెనీలు కలిసి భారత మార్కెట్లోకి ఈ–స్కూటర్‌ను తీసుకొస్తామని ప్రకటించాయి. తమ మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2021–22 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి విడుదల చేయనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ వాహనం వచ్చే ఏడాది జనవరి, మార్చి మధ్య భారత మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉందని ప్రముఖ బిజినెస్ న్యూస్ వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్వూలో కంపెనీ సిఎఫ్‌ఓ నిరంజన్ గుప్తా తెలిపారు.
గొగొరో సంస్థతో భాగస్వామ్యం
హీరో నుంచి విడుదల కానున్న మొట్టమొదటి ఎలక్ట్రిక్ టూవీలర్ మాస్ట్రో ఎడ్జ్‌ను పోలి ఉంటుందని తెలుస్తోంది. ఈ వాహన తయారీపై ప్రస్తుతం ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ–స్కూటర్ ప్రస్తుతం జైపూర్‌లోని హీరో మోటోకార్ప్ ఆర్ అండ్ డి సెంటర్ (సిఐటి)లో సిద్దమవుతోంది. దీని నమూనాను గతడాది నిర్వహించిన హీరో వరల్డ్ కార్యక్రమంలో విడుదల చేశారు. దీంతో ఐసి ఇంజన్-శక్తితో కూడిన కౌంటర్‌ను ఇది పోలి ఉంటుందని స్పష్టమైంది. దీనిలో గోల్డెన్ అల్లాయ్ వీల్స్, ఫ్రంట్ ఫోర్క్ ఎగ్జాస్ట్ సెటప్ ఉండే అవకాశం ఉంది.
ఇతర స్టైలింగ్ ఎలిమెంట్లను పరిశీలిస్తే.. LED హెడ్‌ల్యాంప్, బ్లాక్-అవుట్ విజర్, రియర్‌వ్యూ మిర్రర్స్ వంటివి ఆశించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవ్, పార్క్, రివర్స్‌తో సహా మూడు రైడ్ మోడ్‌లతో రూపొందించబడుతుంది. వీటిని లెఫ్ట్ హ్యాండ్ స్విచ్ గేర్‌తో నియంత్రించవచ్చు. కీలెస్ స్టార్ట్/ స్టాప్, ఇంటర్నెట్ కనెక్టివిటీని కూడా దీనిలో అందించనునున్నారు. ఈ హీరో మోటోకార్ప్ ఎలక్ట్రిక్ టూవీలర్ భారత మార్కెట్లో బజాజ్, టివిఎస్, అథర్, ఒకినావా ఎలక్ట్రిక్ వాహనాలకు గట్టి పోటీనివ్వనుంది.