Belly Fat Burn: చాలా మంది పొట్టను తేలిగ్గా తీసుకుంటారు. కానీ ఆ పొట్టే అనేక రోగాలు వచ్చేందుకు కారణం అవుతుంది. పొట్టను తగ్గించుకునే ఫార్ములా చూద్దాం.
స్కూలు, కాలేజీల్లో చదువుకున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ సన్నగానే ఉంటారు. కారణం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కాబట్టి. తీరా చదువు అయిపోయాక ఏ ఉద్యోగంలోనో చేరగానే... పొట్ట రావడం మొదలవుతుంది. ఎంత ప్రయత్నించినా అది నానాటికీ పెరుగుతూ ఉంటుంది. పెళ్లి తర్వాత మరీ దారుణంగా పెరుగుతుంది. చాలా మంది ఏవేవో ప్రయత్నించి.. నా వల్ల కాదులే అని వదిలేస్తారు. అలాంటి వారికి ఈ సూపర్ ఫార్ములా బాగా పనిచేస్తుందని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అదేంటో తెలుసుకుందాం.
ఉదయం వేళ ఏమీ తినకముందే... బ్రష్ చేసుకొని... గోరు వెచ్చటి నీటిలో ఓ నిమ్మకాయను పిండి... కలుపుకొని తాగేయండి. అందులో పంచదార వేసుకోవద్దు. పుల్లగా ఉన్నా అలా తాగేయడమే. కష్టం అనుకుంటే తేనె కలుపుకోండి. ఇలా చేస్తే మీ బాడీలో మెటబాలిజం వేగం పుంజుకుంటుంది. బాడీలో ఫ్యాట్... ఐస్‌క్రీమ్‌లా కరిగిపోతుంది.
పొట్టలో కొవ్వు తగ్గాలంటే... గోరువెచ్చటి నీరు చాలా అవసరం. నిమ్మకాయ ఫార్ములాను మీరు క్రమశిక్షణతో 6 నెలలు పాటించాలి. ఆ తర్వాత చూస్తే... అసలు మీకు పొట్టే ఉండదు. ఇలాగే ఓ అల్లం ముక్కను సన్నగా తరిగి... వేడి నీటిలో ఉడికించి... ఆ నీటిని వడగట్టి తాగండి. అది కూడా కొవ్వును బాగా కరిగిస్తుంది.
ఇక రాత్రివేళ రోజూ 6 నుంచి 8 బాదం పప్పులను నానబెట్టండి. తెల్లారి వాటి తొక్క తీసి తినేయండి. అలాగే... భోజనానికి అరగంట ముందు యాపిల్ సైడెర్ వెనిగర్ (apple cider vinegar) ను 2 టీస్పూన్లు నీటిలో కలుపుకొని తాగండి. అలాగే భోజనంతోపాటూ... రోజూ పుదీనా కొత్తిమీర సాస్ తప్పక వాడండి.
పొట్టలో కొవ్వు తగ్గాలంటే... రోజు మొత్తమ్మీద మీరు 3 లీటర్ల నీరైనా తాగాలి. మీ బాడీలో ప్రతి 25 కేజీలకూ మీరు రోజుకు 1 లీటర్ నీరు తాగాలి. మీరు 75 కేజీల బరువు ఉంటే... మీకు కనీసం 3 లీటర్ల నీరు రోజుకు అవసరం. నీరు తాగితే కొవ్వు తగ్గడమే కాదు... చర్మానికి కూడా చాలా మేలు.
ఓ కప్పు నీటిలో నిమ్మకాయ రసం వెయ్యండి. మూడు వెల్లుల్లి రెబ్బలు దాన్లో వెయ్యండి. మొత్తం అలా తీసుకోండి. చేదుగా ఉన్నా... కొవ్వు మాత్రం చాలా వేగంగా కరుగుతుంది.
అలోవెరా (Aloe Vera) అనేది చాలా మంచిది. రోజూ 2 టీస్పూన్ల అలోవెరా జ్యూస్ ని గోరువెచ్చటి నీటిలో కలుపుకొని తాగండి. ఇది పొట్టలోకి వెళ్లి... అక్కడున్న నూనె పదార్థాలు, చెత్తంతా మొత్తం క్లీన్ చేసేస్తుంది. ఇలా తాగాక... గంట తర్వాతే ఏదైనా తినండి. ఈ లోపల లోపల అంతా క్లీన్ చేస్తుంది. ఇది రోజూ కాకపోయినా... వారంలో 2సార్లు చేస్తే మంచిది.
యాపిల్...
రోజూ ఓ యాపిల్ తింటే మీ పొట్ట తగ్గుతుంది తెలుసా... ఈ పండులో ఆరోగ్యకరమైన పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అధిక కొవ్వులను కరిగిస్తుంది.
పెరుగు...
ప్రొటీన్భరిత పెరుగు పొట్టలో పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. దీంట్లోని అధిక ప్రొటీన్ జీవక్రియలను మెరుగు పరుస్తుంది. ఇవి అధిక కెలొరీలను కరిగించడంతో పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తాయి.
చిరుధాన్యాలు...
పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వును తగ్గించడంలో చిరుధాన్యాలు ముఖ్య పాత్ర వహిస్తాయి. ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ముతకబియ్యం, గోధుమలు, ఓట్స్, క్వినోవా, రాగులు, సామలు, జొన్నలు... వీటన్నింటినీ ఆహారంలో చేర్చుకోండి మరి.
అదే పనిగా కూర్చుంటున్నారా... దాని బదులు... అప్పుడప్పుడూ లేవండి... అటూ ఇటూ నడవండి... నడిస్తే పొట్టలో ఆహారం జీర్ణం అవుతుంది. అప్పుడు మీకు కొవ్వు పేరుకోదు. పై టిప్స్ అన్నీ సింపుల్ వే. ఏ జిమ్ములకూ వెళ్లకుండా చేసుకునేవే. కాబట్టి పాటించడం ఈజీ అంటున్నారు నిపుణులు.
వీటికి దూరంగా ఉండండి
వేపుళ్లు...
వీటిలో కెలొరీలు ఎక్కువ. ఈ వంటకాల్లోని నూనె పొట్టలోకి వెళ్లి కొవ్వుగా మారుతుంది. ఇది కరిగిపోవడం చాలా కష్టమైన ప్రక్రియ. దాంతో ఊబకాయం, మధుమేహం, మరికొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి వీలైనంత వరకు వేపుళ్లకు దూరంగా ఉండాలి.
చక్కెర ద్రవాలకూ...
మనం తాగే సోడా, శీతల పానీయాలు, మార్కెట్లో దొరికే పండ్లరసాల్లో పెద్ద మొత్తంలో చక్కెర ఉంటుంది. అలాగే బిస్కట్లు, బేకరీ ఉత్పత్తులు, చాక్లెట్లలో కూడా. వీటి నుంచి తక్కువ కెలొరీలు లభిస్తాయి. అయితే చక్కెర ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది రక్తం, హర్మోన్లపై ప్రభావాన్ని చూపుతుంది. ఇది పొట్టకే కాదు కాలేయంలోనూ కొవ్వులు జమ కావడానికి కారణమవుతుంది. ఇది అనారోగ్యానికి సంకేతం. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.
ఉప్పు...
పొట్ట పెరగడానికి ఉప్పు ఎక్కువగా తినడం కూడా ఒక కారణమే అంటున్నారు నిపుణులు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల నీళ్లు ఎక్కువగా తాగాలనిపిస్తుంది. అలా అని అవసరానికంటే ఎక్కువ నీళ్లు తాగితే అది సమస్యే కదా. ఇది మీ బరువులో మార్పు తెస్తుంది.