Vaccine Finder Tool In FaceBook: ప్రస్తుతం కరోనా మహమ్మారిని ఎదుర్కొవడానికి మన దగ్గర ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్. వ్యాక్సిన్ చేయించుకున్న వారు కరోనా భారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ అందించనున్న నేపథ్యంలో ఇప్పటికే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ సెంటర్ ఎక్కడుందో తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఇది సహజమైన విషయమే.. ఈ సమస్యకు చెక్ పెట్టడానికే ఫేస్‌బుక్ సరికొత్త ఫీచర్‌తో ముందుకు రానుంది.
భారత్‌లో వ్యాక్సిన్ ఫైండర్ పేరుతో ఓ టూల్‌ను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలోనే ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫేస్‌బుక్ ఈ టూల్‌ను భారత ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందిస్తోంది. దేశంలోని 17 స్థానిక భాషల్లో ఇందులో సమాచారం అందుబాటులో ఉంచనున్నారు. ఫేస్‌బుక్ యాప్‌లో అందుబాటులో ఉండే ఈ టూల్‌తో యూజర్లు తమకు దగ్గర్లో ఉన్న వ్యాక్సిన్ సెంటర్లను కనుక్కోవచ్చు. కేంద్ర ఆరోగ్య శాఖ అందించిన వివరాల ఆధారంగా వ్యాక్సినేషన్ సెంటర్ల లొకేషన్లు, వాటి పని వేళలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇక ఈ టూల్‌లో కోవిన్ పోర్టల్‌ను కూడా లింక్ చేసి ఉంచారు. దీని ద్వారా టూల్ ద్వారానే వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఫేస్‌బుక్‌లోని కొవిడ్ 19 ఇన్ఫర్మేషన్ సెంటర్‌లో ఈ టూల్ అందుబాటులో ఉంటుంది.