కరోనా వైరస్ సుదీర్ఘకాలం కొనసాగితే సీజనల్ వ్యాధిగా మారే అవకాశం ఉందని ఇటీవల ఐక్యరాజ్యసమితి హెచ్చరికలే నిజమవుతాయా? తగ్గినట్టే తగ్గి మరోసారి కరోనా విశ్వరూపం దాల్చుతోంది.
ప్రధానాంశాలు:
- దేశవ్యాప్తంగా మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు.
- మూడు రోజుల్లోనే లక్షా 20వేల కొత్త కేసులు.
- విద్యా సంస్థలను మూసివేసి ఆన్‌లైన్ తరగతులు.
తాజాగా, ఈ జాబితాలో చత్తీస్‌గఢ్ కూడా చేరింది. ఆ రాష్ట్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో విద్యా సంస్థలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని, తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని చత్తీస్‌గఢ్ మంత్రి రవీంద్ర చౌబే తెలిపారు. గడచిన రెండు వారాలుగా చత్తీస్‌గఢ్‌లో పాజిటివ్ కేసులు భారీగా నమోదుకావడంతో కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా విద్యా సంస్థలను మూసివేయాలని నిర్ణయించారు.
దక్షిణాదిలోనూ కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పాఠశాలలకు విద్యార్థులు హాజరుకావడం శ్రేయస్కరం కాదని తమిళనాడు ప్రభుత్వం భావించింది. సోమవారం (మార్చి 22) నుంచి 9,10,11 తరగతుల విద్యార్థులు కూడా పాఠశాలలకు రావొద్దని తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మార్చి 22 నుంచి ఈ తరగతి విద్యార్థులు భౌతికంగా పాఠశాలలకు హాజరు కావొద్దని తెలిపింది.
గడిచిన 24 గంటల్లో 11.33లక్షల పరీక్షలు చేయగా.. 43,846 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,99,130కి చేరింది. కొత్తగా 22,956 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కు చేరి.. రికవరీ రేటు 96.12శాతానికి తగ్గింది. ఇక కరోనా మరణాలు అంతకుముందు రోజు 188 నమోదు కాగా.. శనివారం రికార్డు స్థాయిలో 197 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా మరణాలు 1,59,755కి చేరుకున్నాయి.