గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: విమానాశ్రయంలో ఉద్యోగాలు.. పాత సామగ్రి విక్రయం.. క్రెడిట్ కార్డు బ్లాక్, ఆధార్ లింక్ పేరిట ఇప్పటి వరకు మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. కొత్త తరహా దోపిడీలకు తెరతీస్తున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఈ మోసమే తార్కాణం. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 20న గన్నవరం పట్టణంలోని ఓ వాలంటీర్‌కు.. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్ కాల్ వచ్చింది. తొలుత తన పరిధిలో ఉన్న గృహాలు ఎన్ని.. అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆ వాలంటీర్‌ని సదరు వ్యక్తి అడగడంతో.. ఓ విద్యార్థికి అమ్మఒడి నగదు జమ కాలేదని చెప్పాడు. దీంతో స్పందించిన అవతలి వ్యక్తి.. విద్యార్థి తండ్రి ఫోన్ నెంబర్ చెప్పు.. కాన్ఫరెన్స్ పెట్టి సమస్య తెలుసుకుంటానన్నాడు. విద్యార్థి తండ్రి ఫోన్ నంబర్‌ను వాలంటీర్ అతడికి చెప్పడంతో కాన్ఫరెన్స్ పెట్టిన కేటుగాడు.. వాలంటీర్ కాల్ కట్ చేసి విద్యార్థి తండ్రిని అమ్మఒడి నగదు పడతాయంటూ మాయమాటలతో ఆకట్టుకొని తొలుత రూ.4వేలు, అనంతరం రూ.9 వేలు వెరసి రూ.13 వేలను తన బ్యాంకు ఖాతాలో జమయ్యేట్లు ఫోన్‌పే చేయించుకొని ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితుడు.. వాలంటీర్ ద్వారా గన్నవరం సీఐ శివాజీ సూచన మేరకు విజయవాడ సైబర్ క్రైమ్‌లో సోమవారం ఫిర్యాదు చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్ పోలీసులు.. మోసగాడి బ్యాంకు ఖాతాలో నగదు జమ అయినందును ఆ విధంగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల్లో అవగాహన లోపం వల్లనే ఇటువంటి మోసాలు జరుగుతున్నాయన్న సీఐ శివాజీ.. సైబర్ నేరగాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
Cyber Crime: అమ్మ ఒడి పేరుతో కొత్త తరహా సైబర్ మోసం
March 23, 2021
0
Tags