కరోనా వ్యాక్సినేషన్ (Corona Vaccination) ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ (AP Local Body Elections) అడ్డుగా మారిందని సీఎం జగన్ (AP CM YS Jagan) అభిప్రాయపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వీలైనంత త్వరగా ఎన్నికలు పూర్తి చేయాలన్నారు. కోవిడ్ నివారణ, వ్యాక్సినేషన్పై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం..అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన.. పలు కీలక వ్యాఖ్యలుచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారిందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోవడం వల్ల వ్యాక్సినేషన్ కు ఇబ్బందులు తెలత్తాయన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉందన్న సీఎం.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవికూడా జరిగిపోయి ఉంటే బాగుండేదన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మిగిలిపోయిన కేవలం 6 రోజుల ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చన్నారు. లేకపోతే వైరస్ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం కష్టమవుతాయని ముఖ్యమంత్రి చెప్పారు. మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలని సూచించారు.
ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, దేశవ్యాప్తంగా మళ్లీ కేసులు పెరుగుతున్న అంశాన్ని పరిగణలోకి తీసుకుని జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల్లో మిగిలిపోయిన ఆ 6 రోజుల ప్రక్రియను వేగంగా పూర్తిచేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరాలని సీఎం పేర్కొన్నారు. ఎన్నికలు ముగిస్తే.., వ్యాక్సినేషన్‌పై యంత్రాంగం తదేక దృష్టిపెట్టేందుకు అవకాశం ఉంటుందిని ఆయన అన్నారు.
వ్యాక్సినేషన్‌ను ఉద్ధృతంగా చేపట్టే కార్యక్రమంలో భాగంగా గ్రామ సచివాలయాలను యూనిట్‌గా తీసుకోవాలన్న జగన్ సూచించారు. సచివాలయం పరిధిలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ను పూర్తిచేయడంపై దృష్టిపెట్టి, ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. వైరస్ సోకినవారికి చికిత్స అందించడం కన్నా.., ఆ వైరస్ రాకుండా నివారణ పద్ధతులపై దృష్టిపెట్టాలన్న సీఎం.. వ్యాక్సినేషన్‌పై సమగ్ర కార్యాచరణతో ముందుకు రావాలని స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ తో పాటు అలాగే కోవిడ్ పరీక్షల సంఖ్యను పెంచాలన్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.