సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది.
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. కరోనా కేసుల నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా ప్రజల్లో ఉన్న నిర్లక్ష్యం కారణంగా కూడా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మునుపటి రోజులను తలపిస్తోంది. తాజాగా రాజమహేంద్రవరంలో కరోనా కేసుల సంఖ్య అందరినీ విద్యారంగాన్ని భయభ్రాంతులకు గురి చేస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమహేంద్రవరం రూరల్ పరిధిలో ఉన్న ఓ కాలేజీలో కరోనా విలయతాండవం చేస్తున్నట్టోంది. ఆ కాలేజీలో రెండు రోజులుగా కరోనా కేసులు బయటపడుతున్నాయి. మొదటి రోజు కొందరు విద్యార్థులను టెస్ట్ చేస్తే 13 కేసులు బయటపడ్డాయి. రెండో రోజు 10 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో కేసుల సంఖ్య తగ్గిందిలే అని ఆ కాలేజీ యాజమాన్యం ఊపిరి పీల్చుకుంది.
అయితే తాజాగా సోమవారం చేసిన టెస్టుల్లో ఏకంగా 140 కరోనా కేసులు బయటపడటంతో కాలేజీ అంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. 700 మంది విద్యార్థుల నుంచి నమూనాలను యాజమాన్యం సేకరించింది. వీటిల్లో 140 మందికి కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. దీంతో పాజిటివ్ వచ్చిన వారందరినీ ఒకే క్యాంపస్ లో ఉంచి ఆ ప్రాంతాన్ని కంటోన్మైంట్ జోన్ గా చేశామని అధికారులు వెల్లడించారు. నెగిటివ్ వచ్చిన 450 మందిని వేరే హాస్టల్ కు తరలించినట్టు వివరించారు. ఈ పరిణామంతో తూర్పు గోదావరి జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విద్యార్థుల్లో కరోనా కేసులు రావడంతో తల్లిదండ్రులు కూడా భయపడిపోతున్నారు.
జనతా కర్ఫ్యూ మొదలయి ఏడాది పూర్తయినా, వ్యాక్సినేషన్ వచ్చినా కరోనా కేసులు మాత్రం ఏమాత్రం ఆగడం లేదు. ప్రజలు కనీస జాగ్రత్తలు కూడా పాటించకుండా తిరుగుతుండటంతో కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ప్రజల జనజీవనం సాధారణ స్థితిలోకి రావడం, స్కూళ్లు, కాలేజీలు కూడా స్టార్ట్ కావడంతో జనసమ్మూహాలు ఉండే ప్రదేశాలు పెరిగిపోయాయి. కాలేజీల్లోనూ, స్కూళ్లల్లోనూ విద్యార్థులకు కరోనా వస్తుందేమోనన్న భయంతోనే చాలా కాలం వరకు విద్యా సంవత్సరాన్ని నేరుగా మొదలు పెట్టలేదు. ఆన్ లైన్ క్లాసులనే జరిపారు. కానీ ఇటీవలే కాలేజీలు, స్కూళ్లు తెరవడంతో విద్యార్థులంతా మునుపటి రోజుల్లోకి వచ్చారు.